నేడు (జనవరి 26) 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు దేశ భక్తి, ప్రేమను చాటుకుంటున్నారు. 1950లో భారత దేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చి నిన్నటికి 73 సంవత్సరాలు పూర్తైంది. ఇవాళ 74వ సంవత్సరంలోకి అడుగుపెట్టాం. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.
హైదరాబాద్ మల్లాపూర్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాలనీ సభ్యులంతా స్థానిక కమ్యూనిటీ హాల్ లో జరిగిన జెండా పండుగలో భాగమయ్యారు.
గోకుల్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ మీసాల వెంకట్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాజీ వైజ్ ప్రెసెడెంట్ కంకణాల రాజు మాట్లాడుతూ.. మహనీయులు సాధించి పెట్టిన ఈ గణతంత్రాన్ని ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ.. ప్రజలు, పాలనా వ్యవస్థలు రాజ్యాంగ పద్ధతుల్లో ముందుకు నడవాలని అన్నారు. ఈ గణతంత్ర దినోత్సవాన్ని యువకులు, పెద్దలు అందరూ కలిసి జరుపుకోవడమే ఐక్యతా శక్తి అని తెలిపారు. ఈ ప్రపంచంలో చూడాలనుకుంటున్న మార్పును మీ నుంచే ప్రారంభించండి అని తెలుపుతూ.. ఈ సారి కొత్తగా బాధ్యతలు తీసుకోబోతున్న వెల్ఫేర్ అసోసియేషన్ టీమ్ అంతా కూడా కలసికట్టుగా పని చేసి గోకుల్ నగర్ అభివృద్ధికి పాటు పడాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న కమ్యూనిటీ హాల్ పనులతో పాటు పార్క్‌లో పిల్లలు ఆడుకునేలా కొన్ని వసతులు కల్పించాలని, ఇందుకోసం పాలకుల నుంచి నిధుల సేకరణ చేపట్టాలని అన్నారు.
కాలనీ మాజీ ప్రధాన సలహా దారులు శివ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఏడాది స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇలాగే ఘనంగా జరుపుకోవాలని చెప్పారు. అలాగే గణేష్ ఫెస్టివల్, దసరా, సంక్రాంతి.. ప్రతి పండగను కాలనీ సభ్యులంతా కలిసి ఘనంగా జరుపుకునేలా కొత్తగా ఏర్పాటు కానున్న కమిటీ చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మీసాల వెంకట్ రెడ్డి, కంకణాల రాజు, కృష్ణా రెడ్డి, శివరాం ప్రసాద్, శేరి రాజు, కిషన్, బిక్షపతి, తోకల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.