హైదరాబాద్- మల్లాపూర్ మార్కండేయ స్వామి పద్మశాలి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నేడు (జనవరి 8) ఆదివారం రోజు జరిగింది. స్థానిక Dr BR అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్, మౌలాలి కార్పొరేటర్ ప్రభు దాస్ విచ్చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మశాలీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. సంఘం తరఫు మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం స్థానిక మల్లాపూర్ లో త్వరలోనే ఓ భవనం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
పద్మశాలీలు రాజకీయంగా ఎదగాలని కోరుకుంటూ వారికి అన్ని విధాలా సాయసహకారాలు అందిస్తానని నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ అన్నారు. మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పద్మశాలీల అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తూ ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందేలా చూస్తానని అన్నారు.
మల్లాపూర్ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు అనంతరాం, జనరల్ సెక్రెటరీ స్వామినాథన్ మాట్లాడుతూ.. తమ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్లు పన్నాల దేవేందర్ రెడ్డి, శాంతి సాయి జెన్ శేఖర్, ప్రభు దాస్ లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. ఆ తర్వాత శాలువా కప్పి మర్యాదపూర్వకంగా సత్కరించారు.